నా రాతలు

మే 31, 2006

కవితా! ఓ కవితా!

Filed under: శ్రీ శ్రీ — by Raju Sykam (చి.|| రాజు సైకం ) @ 7:06 ఉద.

కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?

నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిక్షంలో
ఏయే ఘోషలు, భాషలు, ద్~రుశ్యాల్ తోచాయో ?
నే నేయే చిత్ర విచిత్ర శ్యమంత
రోచిర్ని వహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో ?
నీకై నే నేరిన వేయే ధ్వనులలో,
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్ని నాదాలో!
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝుంఝూ ప్రభంజనం
గజగజ లాడించిన
నడి సంద్రపు కెరటాల్లో, మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం;

ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులలో?
నక్షత్రాంతర్నిబడ నిఖలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుధ్ద్ధం,
అన్నీ, నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం

మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే ద్రుశ్యాలా?
వినిపించే భాష్యాలా ?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ద్వనించే మ్రుదంగ నాదం

ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!

శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మ్రుతు లూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావు బ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులుమూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగ నైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!

కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధ నిమీలత నేత్రాల
భయంకర భాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఝాకంకేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల

హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నని కన్నని విన్నవించగా
మాటలకై వెదుకాడగపోతే
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
చంధస్సుల సర్వపరిష్వంగం వదలి—-
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా స్~రుష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పాపపరంపర
లానంద వశంవద హ్~రుదయుని జేస్తే-

నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి…
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగాననూనస్వానావళితం,
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం.
అమోఘ, మఘాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘ్రుణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!

నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న,
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో!
నా బహిరంత రింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడినై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా
నేడో నా ఊహంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హ్~రుద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విన్~రుమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! ఓ కవితా! ఓ కవితా!

-శ్రీ శ్రీ,1937

శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: